Monday, July 10, 2017

వివక్ష

Coming Soon......!

వినా సెల్ఫోన్ జీవం నాస్తి - సాంఘిక మాధ్యమ వ్యసనం


ఈ రచనలోని సన్నివేశాలు మిమ్మల్ని ఉద్దేశించి ఉన్నాయనిపిస్తే అది మీలో ఉన్న నిజాయితీ కి నిదర్శనం. 
రోజూ జనజీవన స్రవంతి లో చూసే వాటిని మీ ముందుంచే ప్రయత్నమిది. 

మనిషి బతకడానికి కావాల్సిన కనీస అవసరాలు తిండి, ఇల్లు, బట్ట. ఈ ఇరవైఒకటో శతాబ్దం లో, భూమే ఈనిందా అన్నంతగా జనాభా పెరిగిపోతున్న తరుణంలో మనిషి కి ఈ కనీస అవసరాలతో పాటూ అత్యవసరమైనది ఇంకోటి ఉంది. దాని పేరే సెల్ ఫోన్. మనిషి ఊపిరి పీల్చుకోకుండా అయినా బ్రతకగలడేమో కానీ, ఈ పరికరం లేడకుండా క్షణం కూడా బతకలేడు. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు, ఈ తరం జనాలు స్మార్ట్ ఫోన్ తో పుట్టేస్తున్నారు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు కదా. అందుకే జీవితాంతం దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఆధునికత పెరగటం మంచిదే కానీ అది ఎంతవరకు మనిషి ఉన్నతికి ఉపయోగపడుతోంది, ఎంతవరకు మనిషి పతనానికి కారణం అవుతోంది అనేదానిబట్టి ఆధునికత కి విలువ. మనిషి తన మేధోశక్తి వాడి, యంత్రాల్ని కనిపెట్టేది తన పని సునాయాసంగా చేసుకోటానికి, తద్వారా ఆ సమయాన్ని వేరేవాటి కేటాయించుకోవచ్చని. కానీ మనం వాటి బానిసలు అయిపోయి వాటిమీద అవసరానికి మించి ఆధారపడిపోతున్నాం, బానిసలైపోతున్నాం.  ఒకప్పుడు ఈ ఫోన్ ని సంభాషణలకు మాత్రమే వాడేవారు. ఇప్పుడు దానికి తప్ప మిగితా అన్నింటికీ ఉపయోగిస్తాం. ఒకప్పుడు కోడి కూత కు లేచే ఊరు పోయి ఎవడి కోడి వాడి పక్కలో ఉంటుంది. అదే ఫోన్ లో అలారం.  అయితే తప్పేంటి, మారుతున్న కాలంతో మారే వాటిలో కోడి కూత కి రీప్లేస్మెంట్ ఇప్పటి అలారం కదా అని అనచ్చు. కానీ పూర్వం జనాలు ఇంకాసేపు  పడుకోవాలని ఆ కోడి పీక కోసేసి మళ్ళీ పడుకునేవారు కాదు. మనం ఇప్పుడు అదే చేస్తాం. దాన్నే snooze అని పేరు పెట్టాము.  
                                               
లేచి లేవగానే ఒకప్పుడు అరచేతులు చూసుకునో, లేదా భక్తి ఉన్నవారు దేవుడి పటం చూసి లేచేవారు. ఇప్పుడు లేవగానే సెల్ ఫోన్ కోసం తడుముకుంటాం. రాత్రి నుండీ ఎన్ని మెసేజెస్ వచ్చాయో చూసుకోవాలి కదా. కొందరు పళ్ళు తోముకుంటూ, మరి కొందరు స్నానం చేస్తూ, మరి కొందరు ........ అబ్బా .. ఇక్కడ చెప్పటం కష్టం లేండి   ;)
ఆలా ఎక్కడ పడితే అక్కడ , ఎప్పుడు పడితే అప్పుడు దానికి అంటుకుపోయి ఉంటున్నాం. కొంత మందికి ఫోన్ వాడి వాడి బొటన వెలికి బైసెప్స్ వచ్చేసుంటాయి. అంతలా దానికి అంటుకుపోయేలా చేసే యాప్స్ కొన్ని ఉన్నాయ్. అవే facebook & whatsApp. సాధారణంగా ప్రతీ మనిషికి తనగురించి పక్కవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే తపన ఉంటుందని మన్మధుడు సినిమా లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్తాడు. అది మారిపోయి ఈ కాలంలో జనాలకి తాము ఎం చేస్తున్నామో అందరికి చెప్పుకోవటం బాగా అలవాటైపోయింది. అది ఘనకార్యం అయితే పర్లేదు. తుచ్చమైనవి కూడా అందరికి టముకేసుకోటం అలవాటైంది.  దగ్గినా, తుమ్మినా, ఆఖరికి భోంచేస్తున్న అవి అందరికి చెప్పాలి. లేకపోతే నిద్రపట్టదు. వీళ్ళు ఒకెత్తయితే, ఇలా ఎవరెవరు ఎం చేస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకొందరు. 
ఇంకొంతమందికి ఇడ్లీ తిన్నా ఆస్కార్ వచ్చినంత గొప్ప. అది కూడా పెట్టేస్తారు facebook లో. ఈ మధ్యన సెల్ఫీ అని కుల్ఫీ అని , నా మొహం అని, నా మూతని, ఇలా రకరకాల పేర్లతో కుక్కమూతో పందిముతో పెట్టి ఒక ఫోటో పెడతారు. అంతటితో ఆగక ప్రతి ఐదు  నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఎంతమంది లైక్  కొట్టారు అని, గంటలో 100 లైక్స్ రావాలన్న ధ్యేయం తో ఉంటారు. లైక్స్ రాకపోతే కుంగి కూసించిపోయే జనాలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వీళ్ళు మిగితా వాళ్ళని అడిగిమరీ బావుందనిపించుకుంటారు. 
Watching movie with 5 others, Feeling lucky with 2 others, getting engaged with 4 others అని, ఇలా రకరకాలు ఎవడి పిచ్చికి తగ్గట్టు వాడు సభ్యసమాజం లో బహిరంగంగా చెప్పటం వ్యసనం గా మారింది. 
ముక్కు మొహం తెలియని వాడితో ఫ్రెండ్ అయిపోయి మన ఫ్రెండ్స్ లిస్ట్ పెరిగింది అని ఆనందపడిపోతున్నారు. దాన్నే చూసుకుని మన ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిందనుకుంటారు. కానీ మన చుట్టూ ఉన్న జనాల్ని పట్టించుకోరు  అసలు. పక్కవాళ్లతో నోరువిప్పి మాట్లాడం సరికదా మొహం కూడా చూడం. ఒకవేళ మనం చూసినా, వాడు ఎదో తప్పు చేసినవాడిలాగా ఎప్పుడు తలదించుకునే ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉంటాడు. 

ఇంత తీవ్రంగా ఫోన్లు వాడటం వల్ల మంచి మాట దేవుడెరుగు, ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనిషి మెదడు, విన్నదానికంటే చూసిన విషయాలే ఎక్కువ నిక్షిప్తమై ఉంటాయి. అందులోను మంచికన్నా చెడు ఎక్కువగా ప్రభావం ఉంటుంది.  కాబట్టి చూసిన వెంటనే అందులో ఎంతశాతం నిజం ఉంది అనే విచక్షణ కోల్పోయి  అలాంటి వార్తలు చూసినవెంటనే ఎవరికీ తోచిన వారి ధోరణిలో స్పందిస్తారు. పైగా పక్కవాడిని ఎత్తి చూపించటం లో, లోపాలు కనిపెట్టటంలో మనకి మనమే సాటి. మనం స్పందించే ముందు అసలు ఏది నిజం, ఏది అబద్దం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా సాంఘిక ప్రసార మాధ్యమంలో స్పందించేటప్పుడు ఇది చాల అవసరం. ఇది లేనప్పుడు మనిషి ముర్ఖంగా మారి సామాజిక బాధ్యత కోల్పోతున్నాడు.